Telangana Gas Cylinder Scheme: అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..ఇప్పుడు రూ.500లకే గ్యాస్ సిలిండర్‌పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ రెండు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో మొదటిది రేషన్ కార్డ్ ఉన్నవారితో పాటు లేనివారిలోనూ అర్హులను ఎంపిక చేయడం. రెండోది రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులైనవారిని ఎంపిక చేయడం.
ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అందులో వివిధ కంపెనీల కస్టమర్స్ ఉన్నారు. ఇక రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు దాదాపు 90 లక్షలు. తొలి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగా అమలుచేయొచ్చని, అయితే అనర్హులూ లబ్ధిదారులయ్యే అవకాశం ఉంటుందని, మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చింది పౌరసరఫరాలశాఖ. ఇక రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్దిదారులను గుర్తించడం అంత ఈజీ కాదని..అందుకు చాలా సమయం పట్టొచ్చని భావిస్తున్నారు అధికారులు.
ఇక ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955. ఉజ్వల్ కనెక్షన్లకు రూ.340ల రాయితీ అందిస్తోంది. రాష్ట్రంలో ఉజ్వల్‌వి 11.58 లక్షలు ఉన్నాయి. ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. మిగిలిన వినియోగదారుల్లో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే 500 రూపాయలకు ఏడాదికి 6 సిలిండర్లిస్తే రూ.2,225కోట్లు..అదే ఏడాదికి 12 సిలిండర్లిస్తే..ప్రభుత్వంపై 4,450కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తేల్చారు అధికారులు.
మరోవైపు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే సిలిండర్ సబ్సిడీ రాదనే ప్రచారంతో ఆందోళన చెందిన వినియోగదారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు క్యూ కట్టారు. ఐతే గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని..డెలివరీ బాయ్ దగ్గరే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్. గ్యాస్ కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరింది. ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ కేవైసీ పూర్తికాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని సూచించింది.
ఐతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరూ 6 గ్యారంటీల అమలుకోసమే చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతున్న సర్కార్..తాజాగా 500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
Also Read: