Tenth Exam Rules: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు హాజరుకానున్న విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్ష సమయంలో ఒక్క నిమిషం నిబంధన ఉండదని స్పష్టం చేసింది. పరీక్షా హాలులోకి ప్రవేశించేందుకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. దీంతో 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9.35 వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష 12.30 గంటల వరకు కొనసాగుతుంది.
గతేడాది పరీక్షల సందర్భంగా క్వశ్చన్ పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం లాంటి అంశాలు అప్పటి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఇలాంటి ఘటనలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు వెల్లడించారు. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు.