ఓ వైపు అగ్రనేతలు పార్టీ మారుతున్న వేళ.. బీజేపీకి (BJP) కొత్త పంచాయితీ తలనొప్పులు తెస్తోంది. వేములవాడ టికెట్ ను తుల ఉమకు (Tula Uma) కేటాయించడంతో మాజీ గవర్నర్ కుమారుడు వికాస్ రావు వర్గీయులు భగ్గుమంటున్నారు. ఉమకు సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. మూడు రోజుల్లో టికెట్ మార్పుపై నిర్ణయం తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హైకమాండ్ కు డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ హెడ్ ఆఫీస్ లో ఓ యువకుడు వికాస్ రావుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Telangana Elections: తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..
ఈటల కారణంగానే వికాస్ రావుకు టికెట్ దక్కలేదని ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. బండి సంజయ్ మీద కోపంతో వికాస్ రావుకు టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఓ దశలో వికాస్ రావుకు టికెట్ కన్ఫామ్ అయ్యిందని ప్రచారం సాగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఈటల చక్రం తిప్పి టికెట్ ను అడ్డుకున్నారని మండిపడుతున్నారు.
తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. అత్యంత సీనియర్ అయిన తన మాటను పట్టించుకోలేదని ఆయన కూడా బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే.. బీజేపీ హైకమాండ్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.