తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం రాత్రివరకు రాష్ట్రవ్యాప్తంగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. అయితే కచ్చితమైన గణాంకాలను రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటించునున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. అయితే తాజా పోలింగ్‌లో 70.66 శాతంగా నమోదైందని.. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డిసెంబర్ 3న ఓట్లు లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో అధికార పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.
గురువారం సాయంత్రానికి అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం మాత్రమే నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: రికార్డ్ బ్రేక్ కాదు.. బ్రేక్ డౌన్ అయిన పోలింగ్.. 70 శాతం దాటడం కూడా కష్టమే..!
మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 వరకు.. మిగతా 106 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న వారందిరికి ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.