TS Politics: బీజేపీకి తుల ఉమ రాజీనామా.. కిషన్ రెడ్డికి సంచలన లేఖ!

వేములవాడ టికెట్ ను ఇచ్చినట్లు ఇచ్చి ఆఖరి నిమిషంలో మార్చడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుల ఉమ ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. బీసీ బిడ్డనైన తనకు అన్యాయం చేసినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఉమ.

New Update
TS Politics: బీజేపీకి తుల ఉమ రాజీనామా.. కిషన్ రెడ్డికి సంచలన లేఖ!

బీజేపీకి తుల ఉమ (Tula Uma) రాజీనామా చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఆమె లేఖ రాశారు. ఈటల రాజేందర్ తో (Etala Rajendar) పాటే తుల ఉమ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. వేములవాడ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఉమ.. పార్టీలో చేరిన నాటి నుంచి అక్కడ పని చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు వేములవాడ టికెట్ కేటాయించింది బీజేపీ. అయితే.. ముందుగా ఉమకే టికెట్ ప్రకటించిన బీజేపీ నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిని మార్చింది. దీంతో ఉమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టారు. బీసీ మహిళకు బీజేపీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఇక కొనసాగేది లేదన్న సంకేతాలను ఆ సమయంలోనే ఇచ్చారు ఉమ. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Voters: మొత్తం 3.26 కోట్ల ఓట్లు.. 10 లక్షల కొత్త ఓటర్లు.. లేటెస్ట్ లెక్కలివే!

బీసీ బిడ్డనైన తనకు అన్యాయం చేసినందున బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ''భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నావంతు కృషి చేశాను. పార్టీకి నేను చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో బీ ఫాం వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు.. నా గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానం, యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. బీజేపీలో పార్టీ కోసం పనిచేసే కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నరు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేశారు. అసలు బీ ఫాంలే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకుపోతా అనడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో తెగించి కోట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారురాలిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా సేవ చేసే భాగ్యం లభించింది. ఈ ప్రాంత ప్రజలతో నాకు ఉన్న అనుబంధాన్ని ఈ ఎమ్మెల్యే టికెట్లు తెంపలేవు. నా ప్రజాసేవలో నేను ప్రజలకు మరింత చేరువవుతాను. మహిళా సాధికారత, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం అని చెప్పే మీరు ఓ బీసీ మహిళనైన నన్ను ఇలా అవమానించడం బాధించింది.

ఇంతటి అన్యాయం చేసిన పార్టీలో నేను కొనసాగలేను. బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదవికి రాజీనామా చేస్తున్నాను. నా వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాను. నా వెన్నంటి ఉన్న నా గొల్ల కురుమలకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను..'' అని లేఖలో పేర్కొన్నారు తుల ఉమ.

అయితే.. తుల ఉమకు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేశారని ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ నేతలు కూడా ఆమెతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తాయి. దీంతో తుల బీఆర్ఎస్ లో చేరుతారా? లేక కాంగ్రెస్ లో చేరుతారా? అన్న విషయంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రోజు లేదా రేపు ఆమె తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు