TS Elections 2023: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

40 శాతం ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ 47 శాతం ఓట్ షేర్ సాధించగా.. కాంగ్రెస్ 29 శాతానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఈ లెక్కలు ఎలా మారుతాయన్నది ఆసక్తిగా మారింది.

New Update
TS Elections 2023: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2023) చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పోలింగ్‌ పూర్తికాగా.. ఆదివారం కౌంటింగ్‌ ఆ తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. కేవలం తెలంగాణలోనే కాక.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) హ్యాట్రిక్‌ కొడుతుందా..? కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇస్తారా..? బీజేపీ(BJP), ఎంఐఎంలో (MIM) కింగ్‌ మేకర్‌ ఎవరు..? వంటి అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మరోవైపు.. కాంగ్రెస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. అయితే.. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 40 శాతం ఓటు షేరు దక్కించుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి 40 శాతం ఓటు షేరు దక్కించుకునే పార్టీ ఏది..? గత ఎన్నికల గణాంకాలు ఎలా ఉన్నాయి..? తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: TS Congress Politics: గెలుపు సర్టిఫికేట్ తీసుకోగానే ఎమ్మెల్యేలు కర్ణాటకకు.. బెంగళూరులో కాంగ్రెస్ క్యాంప్?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటు షేరు కేవలం 34 శాతం మాత్రమే. అయినా.. 63 సీట్లు సాధించి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. గత ఎన్నికల్లో 88 సీట్లు కైవసం చేసుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ. 2014లో 34 శాతం ఓటు షేరు సాధించిన బీఆర్‌ఎస్‌ 2018లో ఏకంగా 47 శాతం ఓటు షేరు సాధించింది. ఇక 2018లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా బరిలోకి దిగితే.. కాంగ్రెస్‌, టీటీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశారు. అయినా.. ఈ కూటమి దక్కించుకున్న సీట్లు కేవలం 22 మాత్రమే. అలాగే 2014లో 29 శాతం ఉన్న కాంగ్రెస్‌ షేరు స్వల్పంగా పెరిగి 29.48 శాతానికి మెరుగుపర్చుకుంది. అటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. కాషాయ పార్టీకి దక్కిన ఓటు షేరు 6.98 శాతం మాత్రమే.
ఇది కూడా చదవండి: Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు!

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారగా.. బీజేపీ అనూహ్యంగా తన ఓటు షేరును పెంచుకుంది. బైపోల్స్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ 28.43 ఓటు షేరు సాధించి కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి నెంబర్‌ టూ స్థానాన్ని దక్కించుకుంది. ఇక జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ఓటు షేరు కేవలం 6.64 శాతం మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో అధికార బీఆర్‌ఎస్‌ ఓటు షేరు కొంత పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటు షేరు 41.29 శాతం కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి వచ్చిన ఓటు షేరు 35.77 శాతం.

ఇక తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటు షేరు సాధించిన పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమంటే మేమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గత ఎన్నికల్లో 40 శాతానికిపైగా ఓటు షేరు కలిగి ఉన్న బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇక.. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. తమకే అనుకూలంగా ఉన్నాయని, ఈసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమేనంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే.. గతంలో కాంగ్రెస్‌ ఓటు షేరు 30 శాతం కూడా దాటలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తన ఓటు షేరు వాటాను 18 శాతానికి పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. ఒకేసారి ఏకంగా 18 శాతం ఓటు పెరగడం దాదాపు అసాధ్యమని అంటున్నారు రాజకీయ పండితులు.

మరోవైపు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు దక్కించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దక్కించుకునే సీట్లపైనే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఉత్కంఠ రేకిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించేది ఎవరు..? కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా..? ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కాంగ్రెస్‌ నిజం చేస్తుందా..? అన్నది ఉత్కంఠం కలిగిస్తోంది. మరి తెలంగాణ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తెలియాలంటే.. ఫలితాలు వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు