తెలంగాణ(Telangana) బీజేపీపై ఈటల(Etela Rajendar) పట్టు సాధిస్తున్నారా..? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి(Kishan reddy), మాజీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) కంటే ఈటల పట్ల పార్టీ హైకమాండ్ విశ్వసనీయత కనబరుస్తోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వైపు నిలబడిన అభ్యర్థులను చూస్తే.. ఈటలకే అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఎల్బీ నగర్ టికెట్‌పై సస్పెన్స్:
బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ స్థానంలో ముషీరాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పోస రాజు. అయితే.. ఆయనకు టికెట్ కేటాయింపు వెనుక పెద్ద లాబీయింగే జరిగిందనే చర్చ నడుస్తోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ సిఫార్సుతోనే రాజుకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, రాజేందర్‌నగర్ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి, మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి ఎస్.సురేందర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి ఎల్.దీపక్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లకు టికెట్లను కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. ఎల్బీ నగర్ టికెట్‌పై కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే.. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. ఆయన బీజేపీలో చేరితే సామ రంగారెడ్డి టికెట్‌ను బేతి సుభాష్‌రెడ్డికి కేటాయించే అవకాశం ఉంది.
ఈటల వైపే ఇంట్రెస్ట్:
మరోవైపు.. బీజేపీ విడుదల చేసిన మూడో అభ్యర్థుల జాబితాలో బీసీలకు 13, రెడ్డిలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, బ్రాహ్మిణ్, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు ఒక్కొక్క టికెట్ కేటాయించింది. మొదటి రెండు జాబితాల్లో తన పేరు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన బాబుమోహన్‌కు ఈటల హామీ ఇవ్వడంతో.. మూడో జాబితాలో ఆయన పేరు చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద.. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో ఈటల మద్దతుదారులకు అధిక ప్రాధాన్యం లభించడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే కూడా ఈటల పైనే బీజేపీ అధిష్ఠానం విశ్వసనీయత కనబర్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఇదేనా..?