ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారాన్ని షురూ చేశాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుస మీటింగ్‌లు పెడుతూ జనాల్లోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ తమ జాతీయ నాయకులను బరిలోకి దింపుతున్నాయి. ఢిల్లీ పెద్దలు తెలంగాణలో సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తమ అగ్రనేతలను ఎప్పుడో రంగంలోకి దింపింది. వరుస సభలతో రాహుల్ గాంధీ, ప్రియాంక బిజీగా ఉన్నారు. ఖర్గే కూడా ఇప్పటికే ఓ సభ పెట్టారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.
పాదయాత్ర.. మీటింగ్:
రాహుల్ గాంధీ ఈ మధ్యాహ్నం నుంచి బిజిబిజీగా గడపనున్నారు.బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి షాద్ నగర్ చౌరస్తా వరకు పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2 గంటల 30నిమిషాలకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకూర్తిలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చెర్లలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్ ఉంది. ఇక సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు షాద్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి షాద్ నగర్ చౌరస్త వరకు రాహుల్ గాందీ పాదయాత్రగా వెళ్లనున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రసంగిస్తారు.
ఇక నిన్న కొల్లాపూర్ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రియాంకకు హెల్త్‌కు బాలేదు. అందుకే నిన్నటి సభకు కూడా రాహుల్ గాంధీనే వచ్చారు. కొల్లాపూర్ సభలో బీఆర్‌ఎస్‌పై రాహుల్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి వల్లే ఇటీవల మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలను ‘ప్రజల తెలంగాణ’, ‘దొరల తెలంగాణ’ మధ్య పోరుగా అభివర్ణించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలను ఆదుకునే ప్రజా తెలంగాణకు భరోసా ఇస్తుందన్నారు.
Also Read: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!