తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) వేడి తారా స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష నేతల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. అయితే రాజకీయ చైతన్యానికి మరుపేరైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో (Nalgonda) ఈ సారి ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండ తర్వాత.. కాంగ్రెస్ అడ్డాగా మారింది. అయితే.. గత ఎన్నికల్లో ఆ పరిస్థితి తారుమారైంది. ఈ ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ లోనే టాప్ లీడర్లు అయిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రెండు బీఆర్ఎస్ ఖాతాలో చేరిపోయాయి.
ఈ వార్త కూడా చదవండి: Barrelakka Song: సంచలనంగా మారిన బర్రెలక్క రామక్క పాట.. హోరెత్తుతోన్న ప్రచారం!
మిగిలిన నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే గులాబీ గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి జిల్లా అంతా గులబీమయమైంది. అయితే.. ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలంతా వారంతా చావో రేవో అన్న తీరుగా తలపడుతున్నారు. విభేదాలను పక్కనపెట్టి ఒకరికోసం మరొకరకు ప్రచారం చేసుకుంటూ.. అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు.
రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీఎం కేసీఆర్ ఇప్పటికే జిల్లాను చుట్టేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సారి కూడా ఆగ్రనేతలకు మరో సారి ఓటమి రుచి చూపిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. జిల్లా ను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.