ఓటర్లను ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) పై కేసు నమోదు చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొంగరగిద్దలో ఆమె ప్రచారం చేశారు. అయితే.. ఈ సందర్భంగా స్థానిక మహిళా కార్యకర్తలు మంత్రికి మంగళహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో మంత్రి మంగళహారతి పళ్లెంలో రూ.4 వేలు పెట్టి.. మహిళలకు కానుకగా అందించారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?.. కాంగ్రెస్‌పై కవిత ఫైర్..
దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (FST) ఈ విషయంపై గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మంత్రి ఓటర్లను ప్రలోభపెట్టడంలో భాగంగానే ఇలా రూ.4 వేలను మంగళహారతి పళ్లెంలో పెట్టారని ఎఫ్ఎస్టీ తన ఫిర్యాదులో పేర్కొంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం మంగళహారతిలో కానుక పెట్టడం సంప్రదాయమని.. అందులో భాగంగానే మంత్రి ఇలా చేశారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. కొంగరగిద్దలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ పాలనలో తండాలను గ్రామపంచాయతీలు చేసుకున్నామని.. గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుకున్నామన్నారు.