తెలంగాణ రాజకీయం (Telangana Politics) అంతా ఓ లెక్క.. ఖమ్మం డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ మరో లెక్క. రాష్ట్ర రాజకీయాలను తలదన్నే ట్విస్ట్ లు ఈ జిల్లాలో తరచుగా కనిపిస్తుంటాయి. అన్ని పార్టీల ప్రభావం ఈ జిల్లాపై ఉంటుంది. కమ్యూనిస్టుల ప్రభావం రాష్ట్రమంతా తగ్గినా.. ఈ జిల్లాలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఇంకా ఉంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ జిల్లాకు చెందిన వారే కావడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రమంతా టీడీపీ దెబ్బతిన్నా.. ఖమ్మంలో మాత్రం అంతో ఇంతో ఉంది. ఏపీకే పరిమితమైన వైసీపీ ప్రభావం కూడా ఈ జిల్లాపై ఇంకా ఉంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ ఓ ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ అంతటా దెబ్బతిన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం రెండు స్థానాలను కైవసం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Nalgonda Politics: హాట్ టాపిక్ గా నల్గొండ పాలిటిక్స్.. గులాబీల జాతరా? హస్తం హవానా?
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రం అంతా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన సంభాని చంద్రశేఖర్ లాంటి వారు బీఆర్ఎస్ లో చేరిపోయారు. వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన తుమ్మల, పొంగులేటి వారు హస్తం గూటికి చేరిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణ పేపర్లలో కర్ణాటక యాడ్స్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొత్త వార్!
బీఆర్ఎస్ ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర ముందుండి నడిపిస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అని.. ఈ జిల్లానుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమని పొంగులేటితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ కు అంత సీన్ లేదని.. మెజార్టీ స్థానాలు తమవేనని చెబుతున్నారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం జిల్లా ప్రజలు ఈ సారి ఏ పార్టీకి పట్టం కడుతారన్నది డిసెంబర్ 3 నాడు తేలనుంది.