Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ మొదలు పెట్టాయి. తమ పార్టీకి ఓట్లు వేయాలని క్యాండిడేట్లు కాల్స్ ద్వారా ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించేందుకు ఈవీఎంలో కారు గుర్తు ఉండే నంబర్‌పై ఓటెయ్యాలని అవగాహన కల్పిస్తున్నారట. ‘హలో నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా’ అంటూ ఒక్కసారిగా సీఎం నుంచి ఐవీఆర్‌ఎస్ కాల్ రావడంతో ప్రజలు షాక్ అవుతున్నారు.
బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కన్ఫామ్..
'ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా.. సిర్పూర్ నుండి అలంపూర్ దాకా.. భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా.. తాండూర్ నుండి చెన్నూర్ దాకా.. మధిర నుండి ముదోల్ దాకా.. మక్తల్ నుండి జుక్కల్ దాకా.. తెలంగాణ అంతటా కారు జోరు.. మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు..' అంటూ ప్రచారం చివరిరోజు కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడో సారి సీఎం అయ్యి హ్యటిక్ రికార్డును నమోదు చేస్తారని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది సిరిసిల్ల ప్రజలే.. మీరు గెలిపించకపోతే నాకంటూ ఓ గుర్తింపు ఉండేది కాదని మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి గర్వపడతా.. తనను ఇంతలా ఆదరించిన సిరిసిల్ల ప్రజల రుణాన్ని ఏమి ఇచ్చిన తీర్చుకోలేనని అన్నారు. అభివృద్ధిలో సిరిసిల్లను పరుగులు పెట్టించామని.. సిరిసిల్లకు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని కాంగ్రెస్ అంటోంది.. ఆరు నెలలకో వ్యక్తి సీఎం అయ్యే మార్పు కావాలా.. రైతు బంధు ఆగిపోయే మార్పు కావాలా అని ప్రశ్నించారు. లేక 3 గంటల కరెంట్ వచ్చే మార్పు కావాలా.. సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యే మార్పు కావాలా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
Also Read:
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!