Telangana elections 2023: కాంగ్రెస్ `కర్ణాటక' ఉచ్చులో చిక్కుకున్న బీఆర్ఎస్, బీజేపీ!

బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్‌కు వేసినట్లేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? లాంటి ప్రశ్నలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి. ఆర్టికల్ చదవడం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

New Update
Telangana elections 2023: కాంగ్రెస్ `కర్ణాటక' ఉచ్చులో చిక్కుకున్న బీఆర్ఎస్, బీజేపీ!

2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎజెండా టీఆర్ఎస్(బీఆర్‌ఎస్‌), ఆ పార్టీ అధినాయకుడు కేసీఆర్ చుట్టూ తిరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లాంటి పార్టీలు అన్ని కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలు, ఆయన పాలనలో వెలుగు చూసిన అంశాలే ఎన్నికలను నడిపించాయి.

అయితే, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రాజకీయాలు బీజేపీ చుట్టూ తిరిగాయి. ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఒక వంక బీఆర్ఎస్ కేసీఆర్, మరోవంక కాంగ్రెస్ నాయకులు ప్రచారం సాగించారు. టీఆర్ఎస్(బీఆర్‌ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూడటం ప్రారంభించడంతో ఇతర పార్టీల నుండి ఎందరెందరో ఆ పార్టీకి వలసలు రావడం ప్రారంభమైంది.

అయితే, గత మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అక్కడ బీజేపీ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణాలో సహితం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మూడోస్థానంలో ఉందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణాలో అధికారంకు గట్టి పోటీదారునిగా నిలబడే స్థాయికి చేరుకుంది.

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే అక్కడ అనుసరించిన వ్యూహాలు, ఇచ్చిన నినాదాలను తెలంగాణాలో కూడా ప్రయోగించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆ ఉచ్చులో చిక్కుకు పోయి కర్ణాటక రాజకీయ పరిణామాలపై దృష్టి సారిస్తూ ఉండడంతో కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికలలో కీలక రాజకీయ శక్తిగా వెలుగొందే అవకాశం కల్పిస్తున్నట్లు అవుతుంది.

బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల ప్రణాళికలు సహితం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలకు సమాధానాలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. పదేళ్లుగా అమలు చేయలేక పోయిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నియామకం వంటి పలు అంశాలపై నిర్దుష్టమైన హామీలు ఇవ్వడంలో బీఆర్ఎస్ విఫలమైన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.

బీజేపీ కూడా ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ఉమ్మడి పౌరస్మృతి, ముస్లిం రేజర్వేషన్ల రద్దు వంటి భావాత్మకమైన, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రయోగించిన అంశాలకే ఎన్నికల ప్రణాళికలో భాగం కల్పించారు. లోతయిన కసరత్తు జరిగిన దాఖలాలు లేవు. పైగా, ఎన్నికలకు పది రోజుల ముందే మేనిఫెస్టో ను విడుదల చేయడంతో పోలింగ్ నాటికి ప్రజలకు చేరేవిధంగా చేసే వ్యవధి లేకుండా పోయిందని చెప్పవచ్చు.

బిఆర్ఎస్ గాని, బిజెపి గాని తమ ఎన్నికల ప్రణాళికల గురించి, తమ విధానాల గురించి గాని ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేయడంకన్నా కర్ణాటకలో కాంగ్రెస్ ఏవిధంగా ఎన్నికల హామీల అమలులో విఫలమైందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది అంటూ బిఆర్ఎస్ పూర్తి పేజీ పత్రికా ప్రకటనలు ఇచ్చింది.

కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి అశ్వథ నారాయణను బీజేపీ హైదరాబాద్ కు పిలిపించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు కీలక హామీల అమలులో ఏవిధంగా విఫలమైందో అంటూ రెండు పేజీల ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. కేసీఆర్ తో పాటు బీజేపీ జాతీయ నాయకులు సహితం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరుగబోయే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు.

బహుశా గత పదేళ్లలో తెలంగాణాలో ఏ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఈ విధంగా `సెంట్రల్ స్టేజ్'కు చేరుకున్న సందర్భం లేదని చెప్పవచ్చు. తాము అధికారంలోకి వచ్చేశామనే ధీమాతో ఒక వంక కాంగ్రెస్ నేతలందరూ అంతర్గత విబేధాలను పక్కకు నెట్టి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తూ ఉంటె, బీఆర్ఎస్, బీజెపి నేతలు ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో అనే భయంతో ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

దేశంలో మరో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కాంగ్రెస్ అగ్రనాయకులలో సహితం వ్యక్తం అవుతున్నది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలలో తాము కీలక పోటీదారువులంగా లేదని గ్రహించిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ లలో ఎవ్వరు గెలిచినా తమకెందుకులే అనే ఉదాసీనతతో వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో చూసుకొంటాములే అనే నిర్ణయానికి వచ్చారు.

2018లో కేవలం 1 అసెంబ్లీ స్థానం గెల్చుకున్న బీజేపీ 2019లో నాలుగు లోక్ సభ స్థానాలు గెల్చుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఉండబోదనే ధీమాతో ఉంటూ వచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు సర్వేలు వెల్లడి చేస్తుండడంతో హడావుడిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్ సహితం బీజేపీ అగ్రనేతలపై విమర్శలు చేయకుండా కాంగ్రెస్ అగ్రనేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే `ఇందిరమ్మ రాజ్యం' వస్తుందని ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై మొదటిసారిగా స్పందిస్తూ `ఇందిరమ్మ రాజ్యం అంటే నక్సలైట్లను కాల్చి వేయడమా?' అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని విధంగా మండిపడుతున్నారు.

మరోవంక, బీజేపీకి వేసే ఓట్ బీఆర్ఎస్‌కు వేసిన్నట్లే అనే సంకేతాన్ని గ్రామీణ ప్రజలవరకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విజయం సాధించినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ను గెలిపించినా ఆ పార్టీ ఎమ్యెల్యేలు ఎన్నికల అనంతరం కేసీఆర్ తో చేతులు కలుపుతారని బిజెపి ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ శ్రేణులనే నమ్మించలేక అపోతున్నది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా పలు నియోజకవర్గ ప్రభారీలు (ఇన్ ఛార్జ్)లు ఇంకా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించక పోవడంతో గత వారం అటువంటి వారితో ఓ సమావేశం జరిపారు.

ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనే ప్రశ్నలు రాజకీయ ప్రత్యర్థుల నుండే కాకుండా సొంత పార్టీ నేతల నుండే ఎదురవుతూ ఉండడంతో స్థానిక బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారు. `అవినీతి పరులు ఎవ్వరిని వదిలిపెట్టం' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారు బహిరంగసభలలో స్పష్టం చేస్తున్నా బీజేపీ శ్రేణులనే సంతృప్తి పరచలేక పోతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వంటి నేతలు పార్టీని వీడుతూ తాము కేసీఆర్ పై పోరాటంకోసం బీజేపీలో చేరితే, ఆ పార్టీ రాజీ ధోరణి అవలంభిస్తూ ఉండడంతో అక్కడ ఉండలేక పోయామని చెప్పడం గమనార్హం. అయితే, వారు వేరే కారణాలతో పార్టీ మారడం కోసం ఈ అంశాన్ని ఓ సాకుగా చెబుతున్నా, బీజేపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారే ఇటువంటి ప్రశ్నలను అంతర్గతంగా వేస్తుండటం జరుగుతుంది.

ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన అస్త్రంగా చేసుకొని బీజేపీకి వేసే ఓటు బీఆర్ఎస్ కు వేసినట్లే అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయగలుగుతుంది. పైగా, పార్టీలో అసంతృప్తి నేతలను కట్టడి చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకన్నా కాంగ్రెస్ కేంద్ర నేతలు అత్యంత సమర్ధవంతంగా విజయం సాధించినట్లు కనిపిస్తున్నది. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింప చేయగలిగారు.

అసంతృప్తి నేతలకు సర్దిచెప్పి, నిలబెట్టుకునే ప్రయత్నాలు బీఆర్ఎస్, బీజేపీలలో చెప్పుకోదగినరీతిలో జరిగిన్నట్లు కనబడటం లేదు. పలువురు ప్రముఖ నేతలు పార్టీ మారుతున్నారని చాలా ముందు నుండే మీడియాలో ప్రచారం జరుగుతున్నా వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రచారం అంతా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల చుట్టూనే జరుగుతుంది.

ఇక బీజేపీలో కేంద్రం నుంచి వచ్చిన నేతల బహిరంగసభలు మినహా రాష్ట్ర స్థాయి నేతలు చాలా వరకు మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు. కనీసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాదిరిగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు జరిపే ప్రయత్నం చేయడం లేదు. అన్ని పార్టీల ప్రచారంలలో కాంగ్రెస్, కర్ణాటకలో ఆ పార్టీ ఆరునెలల పాలన కేంద్ర బిందువుగా మారుతూ ఉండడం గమనిస్తే ఈ ఎన్నికలు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నట్లు భావించాల్సి వస్తుంది.

చలసాని నరేంద్ర

Also Read: కాంగ్రెస్ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కేటీఆర్‌..

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు