MLA Abraham: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్రహం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో ఆయన కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అబ్రహానికి ఫస్ట్ లిస్ట్ లోనే అలంపూర్ టికెట్ ను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. అయితే.. అందరికీ బీఫామ్ లు ఇచ్చిన బీఆర్ఎస్.. అబ్రహంకు ఇవ్వకుండా నామినేషన్ల చివరి వరకు ఆపింది.
ఇది కూడా చదవండి: పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్
ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజయుడికి బీఫామ్ అందించింది. దీంతో అప్పటి నుంచి అబ్రహం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని అలంపూర్ అభ్యర్థి సంపత్, జిల్లా ముఖ్య నేత మల్లు రవి హామీ ఇవ్వడంతో పార్టీ మారడానికి అబ్రహం ఓకే చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడికి నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ను కూడా ఇటీవల చేర్చుకుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని కాంగ్రెస్ చెబుతోంది.
ఇది కూడా చదవండి: తాండూరులో ఐటీ దాడుల కలకలం.. కాంగ్రెస్ అభ్యర్థి టార్గెట్ ?