తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న అమిత్ షా ప్రకటనపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంట్ బోర్డ్ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటన విడుదల చేశారు.
బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం
సూర్యాపేట జనగర్జన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ మొట్టమొదటిసారి బీజేపీ అని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశమన్నారు. తెలంగాణ ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షించదగిన ప్రకటన విడుదల చేశామన్నారు.
బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదని ఆయన ఆరోపించారు. ఆ పార్టీలలో బీసీలకు అవకాశం లేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలోని మేధావులు, వివిధ సంఘాల నాయకులు ఆలోచించి.. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు. బీజేపీ మొదటి నుంచి నిమ్న వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. అమిత్ షా ప్రకటనను తెలంగాణ సభ్య సమాజం స్వాగతిస్తూ బీజేపీని రానున్న శాసనసభ ఎన్నికలలో గెలిపించాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: పాలస్తీనాలో శాంతి కోసం సీపీఐ శాంతిర్యాలీ..పాల్గొన్న నారాయణ