Telangana : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు (DSC Exams) జులై 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జులై 11న విద్యాశాఖ విడుదల చేసిన హాల్ టికెట్లలోని అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. దీంతో ఎగ్జామ్ కు ముందు ఇలా జరగడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్‌టికెట్ (Hall Ticket) లో చూపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
కరీంనగర్ అభ్యర్థికి ఖమ్మం జిల్లాలో పోస్టు..
మంచిర్యాల జిల్లా (Mancherial District) జన్నారం మండలం కలమడుగుకు చెందిన శ్రీపెల్లి జ్యోత్స్న మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19న డీఎస్సీ పరీక్ష ఉండగా ఆమె నల్గొండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్ టికెట్ విడుదల చేశారు. పరీక్ష కేంద్రాన్ని మాత్రం ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్‌కు చెందిన పొరెడ్డి సౌజన్య డీఎస్సీలో అదే జిల్లాలో ఎస్‌ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జులై 24న కరీంనగర్‌లో పరీక్ష ఉండగా హాల్‌టికెట్‌లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉంది. దీంతో సదరు అభ్యర్థులు హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేశామని, చాలామందికి ఇలాగే తప్పుగా వచ్చాయని వాపోతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తప్పులు సవరించాలని కోరుతున్నారు.
Also Read : ‘వన్ టైం ఛాన్స్’.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్!