Congress MP Tickets: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లో 14 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. 3 స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. దీనిపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మంలో మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టిని పక్కకు పెట్టి మండవకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి రేవంత్ అనుచరుడైన ప్రవీణ్ రెడ్డికి బదులు వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
ఖమ్మం సీటు అయనకే?
ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుండగా ఢిల్లీ పెద్దలు మాత్రం మాజీ మంత్రికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి మండవకే ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌కు మండవ సన్నిహితుడు. అంతకు ముందు వీరిద్దరూ కలిసి టీడీలో కూడా పని చేశారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వంలో మండవ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దాంతో పాటూ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ వర్గం కూడా కలిసి వస్తుందనేది పెద్దల ఆలోచన. పైగా ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి, పొంగులేటి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన మరొకరి దగ్గరి నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధ్యే మార్గంగా.. ఇద్దరికీ ఇబ్బంది లేకుండా మండవకు సీటు ఇస్తే బావుంటుందని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటోందని చెబుతున్నారు. ఏఐసీసీ తుది పరిశీలనలోనూ మండవ పేరును చేర్చారని ఎబుతున్నారు. అయితే ఖమ్మం టికెట్ స్థానికులకు కాక స్థానికేతరుడికి ఎలా ఇస్తారని అక్కడ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. దీని మీద వ్యతిరేకత కూడా రావొచ్చని అంటున్నారు.
కరీంనగర్ బరిలో వెలిచాల..
కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపైనా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరూ నేతల మధ్య టికెట్ వార్ కొనసాగుతుంది. ఒకరు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి మరోకరు మాజీ ఎమ్మెల్యే తనయుడు వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఖరారు అయ్యిందంటూ ప్రచారం సాగింది. కానీ ప్రకటించలేదు. ప్రస్తుతం వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. వెలిచాలకు మంత్రి ప్రభాకర్‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వెలమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో రాజేందర్ రావును కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
ఫిరోజ్‌ఖాన్‌కు హైదరాబాద్ టికెట్..
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎప్పటినుంచో ఎంఐఎం విజయదుందుభి మోగిస్తోంది. మరోసారి ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి మాధవీలత బరిలోకి దిగారు. ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ఫిరోజ్‌ఖాన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పేర్లను అధికారిక ప్రకటన రానుంది.