Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ ఈ రోజంతా కొనసాగనుంది. నిన్నటి నుంచి దీనిపై అధిష్ఠానం సాగిస్తున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చి సోమవారమే సీఎం ఎవరన్న దానిపై ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించడంతో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ మరో రోజుకు వాయిదా పడింది. హోటల్ ఎల్లా నుంచి డీకే శివకుమార్ బయటికి వెళ్లిపోయారు.
ఢిల్లీ వెళ్లి శివకుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశమవుతారు. వివిధ వ్యూహాలపై ఆయన ఏఐసీసీ పరిశీలకులతో చర్చిస్తారు. అయితే, హోటల్ ఎల్లాలో జరిగిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తంచేశారని, అలిగి వెళ్లిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అధిష్టానం చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
సోనియా నివాసంలోనే జరిగిన కాంగ్రెస్ స్టాటజీ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కేంద్ర మాజీ కేంద్రమంత్రులు, సీనియర్లు చిదంబరం, అభిషేక్ సింగ్వి, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, ప్రమోద్ తివారీ, నజీర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రి ఎంపిక మరో రోజుకు వాయిదా పడింది.