Revanth reddy to Launch Indiramma Housing: ఆరు హామీల్లో భాగమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(మార్చి 11) భద్రాచలంలో ప్రారంభించనున్నారు. మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3,500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించుకోనున్నారు. ఐదేళ్లలో స్వయం సహాయక బృందాలకు (SHG) లక్ష కోట్ల రూపాయల సాయం అందించే మరో బృహత్తర పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక సంఘాల సాధికారత కోసం ప్రభుత్వ సాయం, ఇతర కార్యాచరణ ప్రణాళికలను బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.
ఇల్లు లేని వారి కోసం:
గూడు లేని పేదలందరికీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని, ఒక్కరు కూడా నిరాశ్రయులు కాకూడదంటోంది. సొంత భూమి లేదా శిథిలావస్థలో ఉన్న పాత భవనం ఉన్న లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వనుంది రేవంత్ సర్కార్. సివిల్ పనుల పురోగతికి అనుగుణంగా మూడు దశల్లో సహాయం అందించనుంది. తక్కువ ఆదాయ కుటుంబాల జీవన పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు, ఈ పథకం రియల్ ఎస్టేట్ రంగాన్ని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా ఉందని అయితే BRS ప్రభుత్వ విధానాలు ఫలితంగా గ్రామీణ పేదరికం పెరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు:
తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. ఈ నెల 12న(రేపు) ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని అన్నారు. మహిళలను మహాలక్ష్మిలుగా చేయడమే తమ ప్రభుత్వం ఎజెండా అని అన్నారు.
Also ReaD: గత వారమంతా మోత మోగించిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే..