Telangana Local Body Elections: మరికొన్ని రోజుల్లో తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధం కానుంది. స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్న వేళ బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఇప్పుడు పెట్టె ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కులగణన హామీ అమలు చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిపారు. కులగణనను మరి కొన్ని రోజుల్లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో కులగణన జరిగితే బీసీలకు రాజకీయంగా లాభం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ అని అలాంటి బీసీలను ఇన్ని ఇళ్లల్లో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో పర్యటించిన ఎంపీ రాహుల్ గాంధీ కులగణన చేస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీసీ కులగణన తరువాతే స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే.