భూమికి దూరమవుతున్న చందమామ.. ఇకపై రోజుకు 25 గంటలు!

ప్రతిరోజూ రాత్రి మన కళ్ళ ముందు కనిపించే చందమామ మెల్లగా భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఇది చాలా నెమ్మదిగా జరుగుతున్నా.. భవిష్యత్తులో భూమిపై పగటి సమయం, సముద్ర అలలపై ప్రభావాన్ని చూపుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

New Update
moon moving away from Earth (1)

ప్రతిరోజూ రాత్రి మన కళ్ళ ముందు కనిపించే చందమామ చంద్రుడు మెల్లగా భూమికి దూరంగా వెళ్తున్నాడని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఇది భూమిపై రోజు సమయం, సముద్ర అలలపై ప్రభావాన్ని చూపుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

చంద్రుడు ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరంగా కదులుతున్నాడు. ఈ వాస్తవాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు అద్భుతమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 1969 నుండి 1972 మధ్య జరిగిన అపోలో మిషన్‌లో అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపై ప్రత్యేక లేజర్ రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేశారు. వాటితో భూమి నుండి లేజర్ కిరణాలను పంపి, అవి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని లెక్కించి ఈ దూరాన్ని కొలుస్తున్నారు.

చంద్రుడు దూరంగా జరగడానికి ప్రధాన కారణం సముద్రపు అలలు. భూమి, చంద్రుని గురుత్వాకర్షణ శక్తుల పరస్పర చర్య కారణంగా సముద్రాలలో అలలు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండటంతో సముద్రపు నీరు చంద్రుని ఆకర్షణకు కొద్దిగా ముందుగా ఉబ్బుతుంది. ఈ ఉబ్బిన భాగం చంద్రుడిని ముందుకు లాగడం ద్వారా, దాని కక్ష్య వేగాన్ని పెంచుతుంది. కక్ష్య వేగం పెరిగినప్పుడు, చంద్రుడు భూమి నుండి మరింత ఎత్తైన కక్ష్యలోకి, అంటే దూరంగా నెట్టివేయబడతాడు. దీనికి ప్రతిఫలంగా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి భ్రమణ వేగం కొద్దిగా తగ్గుతుంది.

ఈ ప్రక్రియ కొనసాగితే భవిష్యత్తులో భూమిపై పగటి సమయం పెరుగుతుంది. కొన్ని అంచనాల ప్రకారం, దాదాపు 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై ఒక రోజు 25 గంటలు ఉండే అవకాశం ఉంది. అలాగే, చంద్రుడు దూరంగా జరగడం వల్ల సముద్రపు అలల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతుంది. కోట్ల సంవత్సరాల తర్వాత, చంద్రుడు ఆకాశంలో చాలా చిన్నగా కనిపిస్తాడు, దీని కారణంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించకుండా పోతాయి.

ప్రస్తుతం, చంద్రుడు భూమి నుండి సగటున 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ, సంవత్సరానికి 3.8 సెం.మీ అనేది చాలా చిన్న దూరం కాబట్టి, మానవుల ప్రస్తుత తరాలు దీని ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Advertisment
తాజా కథనాలు