/rtv/media/media_files/2025/10/21/google-2025-10-21-13-51-35.jpg)
సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న న్యూయార్క్‌లోని గూగుల్ ఆఫీసులో నల్లులు వ్యాపించాయనే ఆందోళనతో ఆఫీసును తాత్కాలికంగా మూసివేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగులకు 2025 అక్టోబర్ 19వ తేదీన ఈ మెయిల్స్ కూడా పంపించింది. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లుగా స్నీపర్ డాగ్ గుర్తించిందని, అందుకే ఈ ప్రాబ్లమ్ పూర్తయ్యే వరకు ఆఫీసుకు రావద్దని ఉద్యోగులకు తెలిపింది.
ఈ క్రమంలో నల్లుల నివారణకు చర్యలు చేపట్టడంతో సోమవారం నుంచి ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే, భద్రతా చర్యల్లో భాగంగా గూగుల్ ఇతర న్యూయార్క్ క్యాంపస్‌లలో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇక నల్లులకు సంబంధించి దురద లాంటి లక్షణాలు ఏమైనా బయటపడితే వెంటనే తెలియజేయాలని గూగుల్ కోరింది. తమ ఇళ్లల్లో నల్లులు కన్పిస్తే వెంటనే కంపెనీ ఫెసిలిటీస్ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని గూగుల్ ఉద్యోగులను కోరింది. ఒకవేళ తమ ఇళ్లలో నల్లులు ఉన్నట్లు గుర్తిస్తే, వృత్తిపరమైన పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించాలని కూడా సూచించింది.
2010లో కూడా ఇలాంటి సంఘటన
గూగుల్ న్యూయార్క్ గుగూల్ ఆఫీసులో నల్లుల బెడద ఏర్పడటం ఇది రెండోసారి. గతంలో 2010లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. న్యూయర్క్ లోని గూగుల్ ఆఫీసులో పెద్ద మొత్తంలో జంతువుల బొమ్మలు ఉండటం వల్లే ఇది వ్యాపించి ఉండవచ్చని ఆఫీసు వర్గాలు తెలిపాయి.