Samsung’s EV Battery Can Charge In 9 Min : సాధారణంగా పెట్రోల్, డీజీల్ తో నడిచే వాహనాల్లో ప్రయాణించేటప్పుడు.. పెట్రోల్ అయిపొతుందెమో అనే టెన్షన్ అస్సలు ఉండదు. ఎందుకంటే దారి మధ్యలో ఎన్నో పెట్రోల్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ విద్యుత్తు వాహనాల్లో (Electric Vehicles) ప్రయాణించే వారికి ఛార్జింగ్ సదుపాయాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. ఎలెక్ట్రిక్ వాహనంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. ముందుగా వెళ్లే దారిలో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందా..? ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించాలి..? అంత దూరం ఛార్జింగ్ వస్తుందా..? ఇలా ప్రతీ విషయాన్ని పరిశీలించుకోవాల్సి వస్తుంది. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించకపోవడం, బ్యాటరీ లైఫ్, కెపాసిటీ వంటి సాంకేతిక విషయాలు సమస్యలుగా ఉన్నాయి.
శాంసంగ్ EV బ్యాటరీ
అయితే ఇప్పుడు కొరియన్ శాంసంగ్ (Samsung) కంపెనీ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ఎలెక్ట్రిక్ వేకిల్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 965 కిలో మీటర్లు (600మైళ్ళు) పైగా ప్రయాణించే బ్యాటరీని ఆవిష్కరించింది. ఇది డిఫరెంట్ సైజెస్, షేప్స్ లో అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీని కారు, బస్సు, ట్రక్కు ఇలా ఏ ఎలెక్ట్రిక్ వాహనానికైనా ఉపయోగించవచ్చు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్-స్టేట్ బ్యాటరీ ప్రొడక్షన్ లైన్ ఇప్పుడు పూర్తిగా పనిచేస్తుందని వెల్లడించింది. శాంసంగ్‌లోని బ్యాటరీ విభాగమైన శాంసంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది.
బ్యాటరీ ప్రత్యేకతలు
ఈ బ్యాటరీలు 20 సంవత్సరాల జీవితకాలం కలిగి ఉంటాయి. వీటిని కేవలం 9 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. ఈ సాలిడ్-స్టేట్ బ్యాటరీలు ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే చిన్నవిగా, తేలికగా, సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని శాంసంగ్ గత ఆరు నెలలుగా పరీక్షిస్తోంది. హ్యుందాయ్, జనరల్ మోటార్స్.. వంటి కంపెనీల వాహనాల్లో బ్యాటరీని అమర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శాంసంగ్‌లో కంపెనీ బ్యాటరీ విభాగమైన శాంసంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది.