టీమ్ ఇండియా ఈ రోజు ముంబైలో నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్షలాదిగా వచ్చిన అభిమానులతో ముంబై మహానగరం కిక్కిరిసింది. ఎయిర్పోర్ట్ నుంచి నారీమన్ పాయింట్ కు క్రికెటర్లు బయలుదేరారు. అక్కడి నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయయాత్ర కొనసాగనుంది. అక్కడ ఈ విక్టరీ పరేడ్ తర్వాత దేశానికి కప్ తీసుకువచ్చిన భారత క్రికెటర్లను బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది.
మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీ కొనసాగుతోంది. టీ-20 ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్‌లో నిల్చొని ట్రోఫితో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రెండు గంటల పాటు ఈ ర్యాలీ జరగనుంది. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.
మెరైన్ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానులు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత రూ.125 కోట్ల నగదు బహుమతిని అందిస్తారు. అయితే షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబయికి ఆలస్యంగా చేరుకున్నారు. దీనివల్ల రోడ్ షో ఆలస్యంగా ప్రారంభమైంది.