విద్యాబుద్దులు నేర్పవలసిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారు. నిత్యం ఏదోక చోట పాఠశాలల్లో విద్యార్థినుల పట్ల పాడు బుద్దితో ప్రవర్తిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. తాజాగా అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాష్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రెరియన్ పట్టుకొని చితకబాదారు.
విద్యార్థినుల పట్ల భాను ప్రకాష్ నీచంగా వ్యవహరిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ప్రిన్సిపాల్ కు తెలిపినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని అందుకే మేమే రంగంలోకి దిగామని తల్లిదండ్రులు వివరించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయానికి వచ్చి.. లైబ్రేరియన్‌ను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్రీయ విద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గొడవ పెద్దది కాకుండా చర్యలు చేపట్టారు. విషయం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని ..లైబ్రేరియన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే లైబ్రేరియన్ మాత్రం.. తాను విద్యార్థులను అసభ్యంగా తిట్టలేదని చెబుతున్నాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విద్యార్థులతో మసాజ్‌లు చేయించుకోవడం, కాళ్లు నొక్కమనడం, ఇంట్లో వాళ్ల వివరాలు అడుగుతున్నాడని.. అసభ్యకరంగా మాట్లాడటం, పిల్లల లోదుస్తుల గురించి కూడా అడుగుతున్నాడని ఆరోపించారు.
ఏదైనా మాట్లాడితే విద్యార్థులను ఐరన్ స్కేలుతో కొడుతున్నారని.. దీంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని చెప్పారు. ప్రైవేట్ పార్ట్స్‌లో టచ్ చేస్తున్నారని.. ఇంట్లో చెబితే టీసీ ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లైబ్రేరియన్ వికృత చేష్టలపై మూడు రోజుల క్రితమే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. అయితే ఈ విషయం తెలిసి లైబ్రేరియన్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.