TDP Rajyasabha: నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా.. రాజ్యసభకు టీడీపీ దూరం!

తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 41 ఏళ్లకు ఇప్పుడు  ఆ పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోతోంది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో పోటీచేయడానికి తగినంత బలం లేకపోవడంతో టీడీపీ దూరంగా ఉండిపోతోంది. 

TDP Rajyasabha: నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా.. రాజ్యసభకు టీడీపీ దూరం!
New Update

TDP Rajyasabha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి.. పార్టీ ప్రారంభం అయిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విచిత్ర పరిస్థితిలోకి జారిపోయింది. ఒకప్పుడు తనకున్న బలంతో కేంద్రంలో కూటమి రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉండి.. ప్రభుత్వంలో మంత్రిత్వశాఖలు కూడా పొందిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం అని .  తెలుగుదేశం 1983లో అధికారంలోకి వచ్చిన తరువాత అంటే, 41 ఏళ్లకు మొదటిసారిగా రాజ్యసభలో తెలుగుదేశం కనిపించకుండా పోతోంది. 

ఎందుకిలా?

ప్రస్తుతం రాజసభలో తెలుగుదేసం పార్టీకి (TDP Rajyasabha)ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒకే ఒక్కరు. ఆయన కనకమేడల రవీంద్రకుమార్. ఈయన పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. ఈ పదవిని, దీంతో పాటు ఖాళీగా ఉన్న మరో రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదు. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోతోంది. 

టీడీపీ ఎందుకు గెలవలేదు?

 ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 174 మంది బలం ఉండగా.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను (TDP Rajyasabha)స్పీకర్ ఆమోదించడంతో టీడీపీ లెక్క 17కి పడిపోయింది. అధికార YSRCకి 151 మంది సభ్యులతో పాటు జనసేన పార్టీ (JSP) ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది.  ఒక అభ్యర్థి రాజ్యసభకు గెలవాలంటే 44 ఓట్లు రావాలి. అయితే, తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.  మొదట్లో 23 సీట్లు గెలుచుకున్నప్పటికీ వైఎస్సార్‌సీపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. 

రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 కంటే తక్కువ ఉండాలి. ప్రస్తుత సంఖ్య 245, అందులో 233 మంది సభ్యులను రాష్ట్ర అసెంబ్లీల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఏపీ రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్సీకి ఇద్దరు, టీడీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా, టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి.

Also Read: వాలెంటైన్స్ డే.. గులాబీల ఎగుమతిలో రికార్డ్.. 

మొత్తమ్మీద ఇప్పుడు రానున్న రాజ్యసభ ఎన్నికలు ఏపీ లో (TDP Rajyasabha)చరిత్రాత్మకం కానున్నాయి. నాలుగు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఒక్క రాజ్యసభ సభ్యుడు లేకపోవడం టీడీపీ వర్గాల్లో నిరాశను రేకెత్తిస్తోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో నేరుగా కాకపోయినా.. పరోక్షంగా అయినా ఈ పరిస్థితి కొద్దిగా గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఇక మరోవైపు వైసీపీ పూర్తిగా 11 మంది రాజ్యసభ సభ్యులతో వెలిగిపోనుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తనకున్న రాజ్యసభ సభ్యుల బలంతో చాలాసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సహాయపడుతూ వచ్చింది వైసీపీ. ఈ క్రమంలో బీజేపీతో నేరుగా పొత్తు లేకపోయినా.. ఒకరకంగా వైసీపీ బీజేపీకి మిత్రపక్షం లానే వ్యవహరించింది అని చెప్పవచ్చు. బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువ ఉన్న పరిస్థితిలో వైసీపీ సపోర్ట్ తో చాలా బిల్లులను గట్టెక్కించుకోగలిగింది బీజేపీ ప్రభుత్వం. ఈ కోణంలోంచి చూస్తే, బీజేపీతో పొత్తు కోసం చూస్తున్న టీడీపీకి రాజ్యసభలో సభ్యులు లేకపోవడం చికాకు కలిగించే అంశంగానే భావించాలి. 

Watch this Interesting Video:

#tdp #rajyasabha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe