Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఆయనకు ఈనెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
ఉదయం నుంచి వాడివేడిగా ఇరు పక్షాల వాదనలు..
ఉదయం 6గంటలకు కోర్టులో ప్రారంభమైన వాదనలు వాడివేడిగా జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. అలాగే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచాలని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి 11.30గంటల నుంచి పోలీసులు చంద్రబాబును ముట్టడించారన్నారు. కనుక అప్పటి నుంచే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు భావించాలని కోరారు. నంద్యాలలో కోర్టు ఉండగా విజయవాడకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబును పోలీసుల కాల్ రికార్డులను కోర్డులకు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు..
మరోవైపు చంద్రబాబు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని.. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించామని.. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని వాదించారు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్ లో తనపేరు లేదని.. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని బాబు తన వాదనల్లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు