కొద్ది రోజుల క్రితం తమిళనాడు (Tamilanadu) మంత్రి(minister), నటుడు ఉదయనిధి స్టాలిన్(udayanidhi stalin) సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా ల వంటిదని దానిని దేశం నుంచి నిర్మూలించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పై హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
కొన్ని చోట్ల ఉదయనిధి మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. పలు చోట్ల స్టాలిన్ కి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఓ అయోధ్య సాధువు అయితే ఏకంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకుని వచ్చిన వారికి ఏకంగా 10 కోట్ల పైన రివార్డు కూడా ఇస్తామన్నారు. మరికొందరు అయితే ఉదయ్ ని చెప్పుతో కొట్టిన లక్షల్లో డబ్బులు ఇస్తామని తెలియజేశారు.
అయితే ఉదయ్‌నిధికి మద్దతు తెలిపిన వారు కూడా కొందరు ఉన్నారు. ఉదయ్ మాట్లాడిన మాటలను కావాలని వక్రీకరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఆయన మాటలు అర్థం చేసుకుంటే అందులోని నిజమైన అర్థం ఏంటి అనేది తెలుస్తుందని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్, సత్య రాజ్ వంటి వారు ఉదయ్ కి మద్దతుగా నిలిచారు.
అయితే ఉదయ్ మాత్రం తాను మాట్లాడిన దానిలో తప్పేమి లేదని..ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని తెలిపారు. అయోధ్య సాధువు ప్రకటించిన ఆఫర్ గురించి అయితే ఆయన వ్యంగ్యంగా స్పందించారు కూడా. తన తలకు 10 కోట్లు ఎందుకు 10 రూపాయల దువ్వెన ఇస్తే చాలు చక్కగా దువ్వుకుంటానని వివరించారు. అంతే కాకుండా ఒక సాధువు దగ్గర పది కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని కూడా ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దేశం గర్వించే విధంగా జీ 20 సమావేశాలను ఏర్పాటు చేశారు బాగానే ఉంది. కానీ దేశంలో ఉన్న పేదల మురికి వాడలను కనపడకుండా కేంద్ర ప్రభుత్వం దాచేసిందని ఆయన విమర్శించారు.
విదేశీ నాయకుల ముందు తమ దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఏర్పాట్లు అని ఆయన అన్నారు. తమిళనాడులో ఉన్న విపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే ఒక పనికి రాని పార్టీ..అది తమిళనాడులో బీజేపీకి చోటు ఇస్తూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.