Pilliion Rider : రోడ్డు ప్రమాదాలను (Road Accidents) ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది. పరధ్యానాన్ని తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి ద్విచక్ర వాహనదారులు పిలియన్ రైడర్‌లతో సంభాషించడాన్ని కేరళ ప్రభుత్వం (Kerala Government) నిషేధించింది.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో రైడర్ మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రభుత్వం భావించింది. దీంతో ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
ఇకపై డ్రైవింగ్ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే ఈ నేరం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) ఆదేశాలు జారీ అయ్యాయి. వెనుక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్‌కు చలానాలు పంపనుంది. అయితే.. ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారో మాత్రం అధికారులు ఇంకా వివరించలేదు.