సీఎం కేసీఆర్ ముందస్తు టికెట్ల ప్రకటనతో బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పలు చోట్ల టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు పెదవి విరుస్తున్నారు. టికెట్లు ఇచ్చినా ఆయా నేతలకు తమ నుంచి సరైన సహకారం అందబోదని తెగేసి చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులపై పునరాలోచన చేసుకోవాలని, టికెట్లను వెనక్కి తీసుకుని ఇతర నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో అసమ్మతి సెగలు రగులు తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై పలువురు నేతలు గుర్రు మంటున్నారు. ఆయనకు ఇచ్చి టికెట్టును అధిష్టానం వెంటనే వెనక్కి తీసుకోవాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏకంగా తీర్మానాలు కూడా చేశారు. టికెట్టు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరిస్తున్నారు.
బొల్లం మల్లయ్యకు ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోకపోతే రాజీనామాలకు కూడా వెనకాడబోమంటని నేతలు చెబుతున్నారు. తాజాగా కోదాడలో పలువురు నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చందర్ రావు, శశిధర్ రెడ్డిలు మాట్లాడారు. టికెట్ వేరే వాళ్లకు ఇవ్వాలని అధిష్టానానికి వ్యతిరేకంగా కోదాడ బీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేశారు.
కోదాడ ఎమ్మెల్యే అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వాటిని అధిష్టానం గుర్తించకపోవడం చాలా అశ్శర్యం వేసిందని వెల్లడించారు. కోదాడ టికెట్ కేటాయింపు పట్ల ప్రజలు సంతోషంగా లేరని వెల్లడించారు. టికెట్టు వెనక్కి తీసుకోకపోతే రాజీనామాలకు చేసేందుకు సిద్దమని కోదాడ మున్సిపల్ చైర్మన్ శిరీష, లక్ష్మీనారాయణ, చిలుకూరు ఎంపీపీ ప్రశాంతి, కోటయ్య చిలుకూరు జడ్పీటీసీ శిరీష, అనంతగిరి జడ్పిటీసీ ఉమ,శ్రీనివాసరావు, మోతే ఎంపీపీ ఆశ, శ్రీకాంత్ తో పాటు పలువురు నేతలు వెల్లడించారు.