World Earth Hour 2024: ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. ఇస్తోంది. అయితే, పెరుగుతున్న జనాభా.. అవసరాలు.. ప్రకృతి మనకిచ్చిన వనరులను క్రమేపీ తగ్గిపోయేలా చేస్తున్నాయి. ఇక్కడ అవసరాలకు సరిపడా వనరులు ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువగా వృధా చేయడం.. అవసరానికి మించి ఖర్చుచేయడం జరుగుతూ వస్తోంది. దీంతో ప్రకృతి వనరుల కొరత పెరిగిపోతోంది. ఆ కొరతను అధిగమించడం కోసం విధ్వంసకర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటోంది. శాస్త్రవేత్తలు ఎన్ని చెప్పినా ప్రజలందరికీ పర్యావరణ సమతుల్యత దెబ్బ తినడం వల్ల వచ్చే ముప్పు అర్ధం కావడంలేదు. అందుకే, వివిధ రకాలుగా అందరినీ చైతన్యవంతం చేయడానికి.. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేయాల్సిన విధులను అందరికీ గుర్తు చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాటిలో ఒకటి ఎర్త్ అవర్ డే. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ద్వారా ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం నాడు ఎర్త్ అవర్ డే (World Earth Hour 2024)నిర్వహిస్తారు. ఈసారి మర్చి చివరి శనివారం ఈరోజు అంటే మార్చి 23న వచ్చింది. .అందుకే, ఈరోజు ఎర్త్ అవర్ డే నిర్వహిస్తున్నారు.
మనమేం చేయాలి?
World Earth Hour 2024: ఈ రోజు రాత్రి 8:30 నుండి 9:30 వరకు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలి. విద్యుత్ పరికరాలు వాడకుండా ఒక గంటసేపు ఉండగలగాలి. ఇదే ‘ఎర్త్ అవర్ డే’ అంటే.
ఎప్పుడు మొదలైంది?
ఎర్త్ అవర్ డే(World Earth Hour 2024) మొదటిసారిగా మార్చి 31, 2007న ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం క్రమంగా ప్రపంచమంతటా జరపటం ప్రారంభమైంది. ఈ ప్రచారానికి ఇప్పుడు 190 కంటే ఎక్కువ దేశాల నుండి మద్దతు లభిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు పాల్గొంటారు. ఎర్త్ అవర్ డే రోజున, ప్రపంచంలోని అనేక చారిత్రక భవనాల్లో విద్యుత్తు నిలిపివేస్తారు. విద్యుత్తును ఆపివేయడం ప్రకృతిలో కార్బన్ ఆనవాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. శక్తిని కూడా ఆదా చేస్తుంది.
Also Read: అవసరానికి ఉపయోగపడని.. రైల్వే యాప్! దీనిని నమ్ముకుంటే అంతే సంగతులు!!
దీని వెనుక కారణం ఏమిటి?
ముందే చెప్పుకున్నట్టు.. ఎర్త్ అవర్ డే (World Earth Hour 2024)జరుపుకోవడం వెనుక ప్రధాన కారణం శక్తి వినియోగాన్ని ఆదా చేయడం, అలాగే ప్రకృతిని రక్షించడానికి వాతావరణ మార్పు – స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడం. దీనితో పాటు, ప్రకృతి నష్టాన్ని అరికట్టడం – మానవజాతి భవిష్యత్తును మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ప్రకృతికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు.
మరి మీరూ..
అన్నివిషయాలు అర్ధం చేసుకున్నారు కదా. మరి మీరు కూడా ఈ ఎర్త్ అవర్ డే(World Earth Hour 2024) ఈవెంట్ లో పాల్గొని రాత్రి రాత్రి 8:30 నుండి 9:30 వరకు విద్యుత్ వాడకుండా ఉంటారు కదూ. ఈ విషయాన్ని పదిమందికీ చెప్పి అవగాహన కల్పించడం కూడా మీ బాధ్యతే సుమా!