Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల (Elections) ముందు నుంచీ వారాహి అమ్మవారిని పూజిస్తున్నారు. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అంతేకాదు తన ప్రచార రథానికి కూడా వారాహి (Varahi) అని పేరు పెట్టారు. ఇప్పుడు కూడా పవన్ మళ్ళీ వారాహి అమ్మవారి దీక్షను చేస్తున్నారు. 11రోజుల పాటూ ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు. 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. జూన్ 26 నుంచి అంటే రేపటి నుంచి పవన్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టనున్నారు. అసలు ఆయన ఈ దీక్షను ఎందుకు చేస్తున్నారు? ఎవరీ వారాహి అమ్మవారు?
వారాహి అమ్మవారు ఎవరు?
దుర్గామాత… భారతదేశం మొత్తం పూజించే దేవత. మన పురాణాల ప్రకారం ఈ దేవతకు ఏడు అవతారాలున్నాయి. అందులో ఒకటే వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు.
రూపం…
వరాహం అంటే పంది. ఈ రూపంలో ఉండే వారిని వరాహుడు, వారాహి అంటారు. వారాహి అమ్మవారు కూడా మోహం వరహా రూపంలో, ఎనిమిది చేతులు కలిగి ఉంటారు. ఎనిమిది చేతులలోనూ శంఖువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాలను ఉపయోగిస్తారని ప్రతీతి. ఎప్పటి నుంచో ఈ అమ్మవారిని తెలుగు ప్రజలు పూజిస్తూనే ఉన్నారు. కానీ ఈ దేవతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాత్రమే పవన్ కల్యాణే. జనసేనాని (Janasena) ఆ దేవత గుడి దర్శించడం, దీక్షను చేపట్టడం చేసిన తర్వాతనే ఈమెకు చాలా ప్రాచుర్యం వచ్చింది.
వారాహి అమ్మవారు అంటే ఎందుకు పవన్‌కు అంత గురి?
శత్రువులను జయించడానికి వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే, దీక్ష చేపడితే శత్రుభయం ఉండదని చెబుతారు. ఇక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేస్తారు. ప్రతి సంవత్సరం జేష్ట మాసం చివరిలో ఆషాడమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్కదానిలో కూడా గెలవలేకపోయారు. కానీ 2024లో మాత్రం అలా జరగకూడదని అనుకున్నారు జనసేనాని. దాని కోసం మొదటి నుంచీ చాలా కృషి చేశారు. ఐదేళ్ళ పాటూ ప్రజల్లో కలిసి తిరిగారు. వారితోనే ఉన్నారు. అంతేకాదు టీడీపీ, బీజేపీ,జనసేనలను కలపడంలో… కూటమి విజయం సాధించడంలో కీలకపాత్ర కూడా పోషించారు. ఇదంతా వారాహి అమ్మవారి వల్లనే జరిగిందని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారు. శత్రువులను జయించడానికి ఆయన నమ్మకున్న అస్త్రం వారాహి అమ్మవారి పూజ. అందుకే తన ప్రచార రథానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారం (Election Campaign) కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అనే పేరుపెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్ర అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించడం మనందరికీ తెలిసిందే. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే వైసీపీని కూడా దాటేసింది జనసేన.
Also Read:National: అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై వివాదం.. ఆయన ఇచ్చిన వివరణ ఇదే!