Ration Rice: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ త్వరలోనే మరో శుభవార్త చెప్పనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే సన్నాల సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్‌పై దృష్టిసారించినట్లు సమాచారం. ఇప్పటికే బడిపిల్లల మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సన్నబియ్యం అందిస్తుండగా రేషన్ షాపులకు మాత్రం దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు.
2.82 కోట్ల మందికి లబ్ధి..
అయితే రాష్ట్రంలో మొత్తం 90.23 లక్షల రేషన్ కార్డులుండగా 2.82 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరికోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తు్ండగా.. ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి, సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు నెలకు 25వేల మెట్రిక్ టన్నుల చొప్పు న ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరాఫరా చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తుండగా.. పీడీఎస్ ద్వారా రాష్ట్రంలో పంపిణీ చేసే 21 లక్షల మెట్రిక్ టన్నుల్లో 13లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద కేంద్రం పంపిణీ చేస్తోంది. మిగిలిన 8లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌పూల్ కింద ప్రొక్యూర్మెంట్ చేస్తోంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ..
ఈ మేరకు పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీచేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. మొత్తంగా 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం క్రయవిక్రయాలు 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరుగుతున్నాయి. అయితే సన్నధాన్యం సేకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. ఏడాది పాటు పీడీఎస్ అవసరాలకు సరిపోవాలంటే కనీసం 36-40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కస్టమ్ మిల్లింగ్ చేయిస్తున్న బియ్యంలో దొడ్డు బియ్యం 98 శాతం కాగా సన్నబియ్యం 2 శాతం మాత్రమేనని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కేవలం 2 శాతం ఉన్న సన్న బియ్యం మిల్లింగ్‌ను ఇప్పుడు 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం అనుకున్నంత సులభం కాదు.
క్వింటాలుకు రూ.500 బోనస్..
రైతులు కూడా సన్న వడ్లను ప్రభుత్వానికి అమ్మటం మార్కె ట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కనీస మద్దతు ధర రూ.2,200 ఉండగా రూ.400-500 పెంచి ట్రేడర్లు, మిల్లర్లు, ఎగుమతిదారులు సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. సూపర్ ఫైన్ వెరైటీలకు రూ. 2,800 పలికుతున్నాయి. ప్రైవేటు ట్రేడర్లను కాదని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నాలను తీసుకొస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వ సన్నరకాలు సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ.100-150 బోనస్ ఇస్తామని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించినా సక్సెస్ కాలేదు. కానీ ఈ వానాకాలం సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,203 కనీస మద్దతు ధర ఉండగా… రూ.500 బోనస్ కలిపితే రూ. 2,703 అవుతుంది. సాధారణ రకాలకు కనీస మద్దతు ధర రూ.2,183 ఉండగా రూ.500 బోనస్ కలిపితే రూ. 2,683 కానుంది. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే అంశం ఆసక్తికరంగా మారింది.