చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు భువనేశ్వరి కలిసేందుకు హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్లతో భారీగా వెళ్తున్నారనే సమాచారంతో రాజమండ్రిలో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు చలో రాజమండ్రి పిలుపు నేపథ్యంలో లోకేష్ క్యాంప్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే వాహనాలు ముందుకు పంపిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.
ఇప్పటికే రాజమండ్రి లోకేష్ క్యాంప్ వద్దకు పలువురు ఐటీ ఉద్యోగులు చేరుకున్నారు. పోలీసులు ఆంక్షలు విధిస్తూ.. వాహనాలు అడ్డుకుంటున్నారని, ప్రత్యామ్నాయ మార్గాలలో రాజమహేంద్రవరం రావడం జరిగిందని పలువురు ఐటీ ఉద్యోగులు తెలిపారు. 2018 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము లబ్ధి పొందామని పలువురు ఉద్యోగులు తెలిపారు. ఈ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం జంక్షన్ దగ్గర బార్కెట్లు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాజమండ్రి వైపు పంపిస్తున్నారు. చలో రాజమండ్రి పిలుపునిచ్చిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ముందస్తుగా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే.. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఏపీ పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. వారిని కట్టడి చేసేందుకు దాదాపుగా 250 మంది పోలీసులు మోహరించారు. ఏపీ- తెలంగాణ సరిహద్దు దగ్గర పోలీసుల మొహరించి హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీలు చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. బోర్డర్ వద్ద ఐడీ కార్డులు, వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలేస్తున్నారు. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఖమ్మం జిల్లా మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలు. జనసేన నాయకులతో నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ, జనసేన పార్టీలు అన్నదమ్ముల్లా కలసి పోరాడాలని ఆమె సూచించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నేతృత్వంలో ఇంచార్జ్లు, నేతలు కలిసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిచారు. రేపు జిల్లాలో టీడీపీ దీక్షా శిబిరాలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సందర్శించనున్నారు. ఉదయం 8:30కు అన్నవరం సత్యదేవుని భువనేశ్వరి, బ్రాహ్మణి దర్శించుకోనున్నారు. అనంతరం జగ్గంపేటలో టీడీపీ దీక్ష శిబిరానికి భువనేశ్వరి, బ్రాహ్మణి వెళ్ళనున్నారు.