Upcoming Telugu Movies: ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). బిగ్ బాస్ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన సినిమా ఇది. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరరెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో గర్భందాల్చిన పురుషుడిగా కనిపించబోతున్నాడు హీరో. తెలుగుతెరపై ఇదో సరికొత్త ప్రయత్నం. సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ, అలీ లాంటి ప్యాడింగ్తో వస్తున్న సినిమా ఇది.
ప్రేమ్ కుమార్:
ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా ప్రేమ్ కుమార్ (Prem Kumar). కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్‌తో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభన్ తాజా చిత్రం ఈ ‘ప్రేమ్ కుమార్’. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సారంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సంతోష్ శోభన్.
జిలేబి
థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా జిలేబి (Jilebi). సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జిలేబి’ ట్రయిలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు విజయ్ భాస్కర్ ఫన్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ అందించబోతున్నారని ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ట్రయిలర్లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్ని మరింత ఎలివేట్ చేసింది. ఈ వీకెండ్ ఫన్ కావాలంటే ‘జిలేబి’ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
పిజ్జా-3
హారర్ ప్రియుల కోసం పిజ్జా-3 (Pizza 3)కూడా రెడీ అయింది. మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ సంస్థ.. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ‘పిజ్జా3’ని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది.
భూతాల బంగ్లా
ఈ సినిమాకు పోటీగా భూతాల బంగ్లా (Bhootala Bangla) అనే మరో హారర్ సినిమా కూడా ఈ వారాంతం థియేటర్లలోకి వస్తోంది. మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచతమైన పాపులర్ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హిలేరియస్ యూనిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఆర్కే ఎంటర్టైన్మెంట్పై సి. రమేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి భూతాల బంగ్లా అనే పేరు పెట్టారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
Also Read: ‘వ్యూహం’ టీజర్‌పై రాజకీయ దుమారం.. టార్గెట్ వాళ్లే.. ఆర్జీవీ పంచ్‌లు