CM Revanth Reddy: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి రంగంపై చర్చించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి విడుదల లభ్యతపై సమీక్షించారు. అయితే, తెలంగాణలో వర్షాభావం కారణంగా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. దీంతో.. నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ తేల్చి చెప్పారు. తాగు నీటి కోసమే నీటిని విడుదల చేయగలమని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. కాగా, రెండో పంటకు సాగు నీటి విడుదలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాగర్ ఆయకట్టు సాగు కోసం అవసరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వివరాలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు వివాదం ఏంటి? వివాదం ఎందుకు చెలరేగింది? ఏపీ అధికారుల నీటి విడుదల వంటి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం.
కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈసారి వర్షాభావ పరిస్థితి నెలకొన్నాయి. దీంతో ఈ రెండు నదులకు ఈ ఏడాది వరద ప్రవాహం రాలేదు. దీంతో నీరు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలపోతున్నాయి. ఇక నాగార్జున సాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల సాగు జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో సాగు కోసం నీటి విడుదల కష్టంగా మారింది. ఫలితంగా పంట సాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
`
ఈ నెల 21న జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం..
ఇదిలాఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు గురించి జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులు అయిన వారందరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అలాగే కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు భరోసా కింద ఏడాదికి రూ .12వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. దీంతో పాటు అర్హులైన మహిళలకు రూ.500లేక్ గ్యాస్ సిలిండర్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది.
Also Read: