Asian Games: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచులో శ్రీలంక జట్టును చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఉమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 బంతుల్లో 46 పరుగులు చేయగా.. జెమీమా రోడ్రిగ్స్ 5 ఫోర్లతో 40 బంతుల్లో 42 పరుగులు చేసి రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫాలీ వర్మ 9, రిచా ఘోష్ 9, హర్మన్ ప్రీత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులు చేసి నిరాశపరిచారు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టును భారత బౌలర్లు కట్టడి చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. హాసిని పెరీరా 25, నీలాక్షి డి సిల్వా 23, ఓషది రణసింగ్ 19, చమరి అతపత్తు 12 పరుగులు చేశారు.
A historic selfie 🤳 with the 𝙂𝙊𝙇𝘿 𝙈𝙀𝘿𝘼𝙇𝙇𝙄𝙎𝙏𝙎 🥇👌🏻#TeamIndia | #AsianGames | #IndiaAtAG22 pic.twitter.com/zLQkMRD36W
— BCCI Women (@BCCIWomen) September 25, 2023
ఇవాళ ఉదయమే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం గెలిచింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ సన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన భారత జట్టు తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్లో 1893.7 స్కోర్‌తో భారత్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పొంది. అంతకు ముందు చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్టును ఇండియా ఇప్పుడు బద్దలు కొట్టింది. దీంతో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు చేరాయి. మొత్తం పతకాల సంఖ్య 11కి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి.
2023 సెప్టెంబరు 23న మొదలైన ఆసియా క్రీడలు అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనున్నాయి. 19వ ఆసియా క్రీడల ప్రారంభ వేడుక సెప్టెంబర్ 23న హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా ఆడనుండటం విశేషం.
ఇది కూడా చదవండి: రజతంతో భారత్ శుభారంభం..ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు..!!