ఢిల్లీలోని ఓల్ట్ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బేస్మెంట్లోకి వరద వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఆ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ సహా యజమానులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు వీళ్లకు ఈ మధ్యంతర బెయిల్ వర్తింపజేసింది. అలాగే ఈ సహా యజమానులు రెడ్ క్రాస్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నిబంధనలు పాటించకుండా ఏ కోచింగ్ సెంటర్ కూడా నడపకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇందుకోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోచింగ్ సెంటర్లు ఎక్కడ నడపాలో ఆ ప్రాంతాలను కూడా గుర్తించాలని సూచించింది.
Also Read: భారత్ లో పెరుగుతున్న జీసీసీలు…28 లక్షల ఉద్యోగాలకు అవకాశం!
ఇదిలాఉండగా.. జులై 27న ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని భారీ వర్షం పడ్డ తర్వాత రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లోని బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద వచ్చింది.దీంతో ఆ బేస్మెంట్లో చిక్కుకుని యూపీకి చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నెవిన్ డెల్విన్(24) మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కోచింగ్ సెంటర్ యజమానులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ.. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ సహా యజమానులైన పర్వీందర్ సింగ్, తాజిందర్ సింగ్, హర్విందర్ సింగ్, సరబ్జిత్ సింగ్‌లను అదుపులోకి తీసుకుంది. అయితే ఇటీవల నిందితులు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చివరికి దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసం ఆ నలుగురు సహా యజమానులకు జనవరి 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read: ఇందిరాగాంధీ పక్కన నిలబడి,ఆమె రాజీనామాకే డిమాండ్..వైరల్ పిక్ చెబుతున్న కథ
దీంతో నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందని.. సాక్షులను విచారించే వరకు నిందితులకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. అయినప్పటికీ కోర్టు వాళ్లకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే జులై 27న ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోవడానికి కారణం ఏంటో తెలియజేయాలని సీబీఐకి ఆదేశించింది. అది వర్షపు నీరేనా లేదా వేరే చోటు నుంచి నీరు వచ్చిందా అనేది గుర్తించాలని కోరింది.