Hajj Yatra: అది 2015, సెప్టెంబర్ 24.. ప్రాంతం మినా.. హజ్ యాత్రకు భారీగా తరలివచ్చారు భక్తులు. జమారత్ వద్ద ‘సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు’ భారీ సంఖ్యలో భక్తులు గుమ్మిగూడారు. అందరూ రాళ్లు విసురుతున్నారు. ఇంతలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. నిమిషాల వ్యవధిలో మినా మరుభూమిగా మారిపోయింది. చిన్నారులు, మహిళలు సహా మొత్తంగా 2400 మందికిపైగా మరణించారు. 2015 హజ్ యాత్ర భక్తులకు ఓ పీడ కలగా మిగిలింది. అత్యంత ఘోరమైన హజ్ విపత్తు కూడా ఇదే..!
ఇక 2015 విషాదం జరిగి 9ఏళ్లు గడిచిపోయాయి.. ఈ సారి (Hajj Yatra 2024) సౌదీ అరేబియాలో భానుడు భగ్గుమన్నాడు. 52 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు ఉష్ణోగ్రత టచ్ అయ్యింది. దీంతో ఎండవేడి (Heat Stroke) తట్టుకోలేవ యాత్రికుల వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. వాతావరణ మార్పుల కారణంగా మక్కా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 2024 ప్రారంభంలోనే సౌదీ శాస్త్రవేత్తల అధ్యయనం హెచ్చరించింది. ఇది యాత్రికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే యాత్రికులు సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
మక్కా, మదీనా నగరాలకు ముస్లింలు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో అనేక ఘటనలు ప్రాణనష్టాన్ని కలిగించాయి. ప్రతి ఇస్లాం పౌరుడు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా మక్కాకు (Mecca) వెళ్లాలని కోరుకుంటారు. అందుకే ప్రతీ ఏడాది దాదాపు 30 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణనష్టం సంభవిస్తూ ఉంటుంది.
1990లో మక్కా సమీపంలోని ఓ పాదచారుల సొరంగంలో భారీ ప్రాణనష్టం జరిగింది. టన్నల్‌లో ఊపిరి ఆడక 1,426 మంది యాత్రికులు చనిపోయారు. సంఘటన జరిగిన వెంటనే, కింగ్ ఫహద్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇది పైన ఉన్న దేవుని సంకల్పమని కింగ్ ఫహద్ చెప్పుకొచ్చారు. వాళ్లు అక్కడ చనిపోకపోతే, వేరే చోట చనిపోతారని కామెంట్ చేశారు. మరణించిన వారిలో దాదాపు 680 మంది ఇండోనేషియన్లు ఉన్నారు. దీంతో ఇండోనేషియా అధికారులు సౌదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
1994 మే 24న మినాలో రాళ్లతో కొట్టే ఆచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 270 మంది యాత్రికులు మరణించారు. 2004 ఫిబ్రవరి ఒకటినా హజ్ వేడుకల చివరి రోజున మినా వద్ద యాత్రికుల రష్ విపరీతంగా పెరిగింది. నాటి ఘటనలో 250 మంది యాత్రికులు చనిపోయారు. 2006 జనవరి 12న మినాలో జరిగిన తొక్కిసలాటలో 360 మందికి పైగా యాత్రికులు మృతి చెందారు. అదే 2006లో హజ్ ప్రారంభమయ్యే ముందు రోజు, మక్కాలోని గ్రాండ్ మసీదు సమీపంలో హాస్టల్‌గా ఉపయోగిస్తున్న ఎనిమిది అంతస్తుల భవనం కూలిపోయి 73 మంది మరణించారు.
గత 25ఏళ్లలో సామూహిక మతపరమైన సమావేశాలలో 9,000 కంటే ఎక్కువ మంది మరణించారు. వీరిలో 5,000 కంటే ఎక్కువ మంది సౌదీ అరేబియాలో (Saudi Arabia) హజ్ సమయంలోనే చనిపోయారు. దాదాపు 40 విషాద ఘటనలలో కనీసం 2,200 మరణాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. మతపరమైన విషాదాలకు సౌదీ అరేబియా, ఇండియా హాట్స్పాట్లు ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఒకే చోటకు తరలిరావడం, ఆ సమయంలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు విపరీత రద్దీ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తీర్థయాత్రలపై ముఖ్యంగా దేవుడిపై ఉండే అధిక భక్తి, భావోద్వేగాల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి మరో అది పెద్ద కారణం.
Also Read: NTA: పుట్టుక నుంచే వివాదాలమయం.. NTA స్కామ్స్ లిస్ట్ ఇదే! – Rtvlive.com