Kamala Harris: డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి అయిన కమలా హారిస్‌కు ఘన స్వాగతం లభించింది. కొన్ని నిమిషాల పాటూ చప్పట్లు కొడుతూ ఆమెను విష్ చేశారు. US అధ్యక్ష నామినేషన్‌ను ఆమోదించిన మొదటి నల్లజాతి,ఆసియా అమెరికన్ మహిళగా కమలా చరిత్ర సృష్టించారు. అభ్యర్థిత్వాన్ని స్వీకరించాక కమలా హారిస్ చాలా ఉద్వేగంగా , ఎమోషనల్‌గా మాట్లాడారు. తన భర్తకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెబుతూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాంతో పాటూ తన మూలాలను, తల్లి గురించి చెప్పారు. తన తల్లే తనకు ఆదర్శమని చెప్పారు. నీ జీవితానికి నువ్వే రచయితవు అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని కమలా హారిస్ తెలిపారు.
ట్రంప్ వస్తే అంతే..
ఇక అమెరికా ప్రజలు, ఎన్నికల గురించి మాట్లడుతూ..2024 యూఎస్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి అన్నారు కమలా హారిస్. అమెరికా ప్రజలే తన క్లైంట్స్ అని…వారి గురించే తాను ఎప్పుడూ ఆలోచిస్తానని తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అన్నారు. ట్రంప్ కేవలం తన గురించి తన బిలియనీర్ స్నేహితుల గురించి మాత్రమే ఆలోచిస్తారని విమర్శించారు. ట్రంప్ నిబద్ధత ఉన్న నాయకుడు కాదని అన్నారు. ట్రంప్ నేరారోపణలను, చట్టాలను ఉల్లంఘించిన సంగతులను ప్రస్తావిస్తూ…ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఏ చేస్తారో మీరే ఆలోచించండి అంటూ అమెరికా ప్రజలను ప్రశ్నించారు కమలా.
అమెరికానే ఎప్పటికీ పెద్దన్న..
తాను ప్రాసిక్యూటర్‌గా ఉన్నప్పుడు ప్రజల తరఫునే ఉన్నానని…ఇప్పుడు అమెరికా అధ్యక్షురాలిని అయితే..అప్పుడు కూడా ప్రజల వైపే ఉంటానని హామీ ఇచ్చారు కమలా హారిస్. అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని చెప్పారు. పార్టీ, వర్గాలుగా అమెరికా చీలిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తానని కమల అన్నారు. తాను అధికారంలోకి వస్తే 21 శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను ప్రపంచ పెద్దన్నను కానివ్వనని హామీ ఇచ్చారు.అమెరికాను మరింత బలోపేతం చేస్తానని.. ప్రపంచ నాయకత్వాన్ని త్యజించేది లేదని హామీ ఇచ్చారు. అలాగే తాను అమెరికా అధ్యక్షురాలు అయితే గాజాలో యుద్ధం ముగిసేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తానని చెప్పారు కమలా హారిస్. దాంతో పాటూ ప్రపంచ వ్యాప్తంగా దౌర్జన్యాలతో పోరాడతానని చెప్పారు. నాటో దేశాలతో పాటూ ఉక్రెయిన్‌తో కలిసి నిలబడతానని హామీ ఇచ్చారు.