Kisan Morcha: దేశ సంపదను కొల్లగొడుతూ వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుంచి తరిమికొట్టాలని కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ‘కార్పొరేట్స్ క్విట్ ఇండియా’ పిలపునిచ్చింది. ఈ మేరకు ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా ఏలూరు విజయ విహార్ సెంటర్ లోని రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో..
ఇందులో భాగంగానే కార్పొరేట్స్ క్విట్ ఇండియా అంటూ రైతులు, కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వతంత్య్రం కోసం 1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలు అనుసరిస్తూ వ్యవసాయ రంగాన్ని,ప్రభుత్వ రంగ సంస్థలను, అటవీ సంపదను, ప్రకృతి వనరులను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రైతాంగ, కార్మిక హక్కులను హరించి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో కార్పొరేట్ కంపెనీల పన్ను రాయితీ ఇవ్వడమే కాకుండా గడిచిన పది సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు మాత్రం పైసా రుణమాఫీ చేయలేదని ఇదేనా మోడీ వికసిత్ భారత్ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Dad killed son: స్త్రీ లో దుస్తుల్లో మలం తింటున్న తండ్రి.. కనిపెట్టిన కొడుకు తల నరికి దారుణం!
అలాగే అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినందుకు అటవీ హక్కుల చట్ట సవరణ చేశారన్నారు. కార్పొరేట్ కంపెనీలను దేశం నుండి తరిమికొట్టి దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడాలన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, రైతులకు విత్తన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులు కోత పెట్టడం,జాబ్ కార్డులు తగ్గించడం గ్రామీణ పేదల ఉపాధి దెబ్బతీయడమేనని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.