Kishan Reddy Fires On BRS: సీఎం కేసీఆర్(CM KCR)పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం భూమిని కేటాయించారన్న ఆయన.. ప్రభుత్వ భూమిని ప్రతిపక్ష పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కోకాపేట్ (Kokapet)లో 11 ఎకరాల భూమిని కేటాయించుకున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మకైందని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. కొత్త అప్పులు పుట్టకపోవడంతో ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని విమర్శించారు. నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి అసైన్డ్ భూములను లాక్కొని అమ్మేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపదను సృష్టించాలన్నారు. కానీ కేసీఆర్ రాష్ట్రంలో సంపదను సృష్టించక పోగా.. ఉన్న సంపదను కొల్లగొడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తోందని కిషన్ రెడ్డి అన్నారు. తాను 80 వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. అవినీతిలో ఆరి తేరడానికే పుస్తకాలు చదివారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో స్ట్రీట్‌లైట్ పోతే వేయలేని దుస్థితి నెలకొందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల కోసం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bed Rooms)నిర్మించుకునేందుకు భూమి ఉండదు కానీ.. తన బినామీలకు తక్కువ ధరకు అమ్మేందుకు మాత్రం భూమి ఉంటుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విద్యాలయాల కోసం భూమి అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు భూమి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మోస పూరిత హామీలతో ప్రజలను ఆగం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విలువైన భూములను పంచుకున్నాయన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ కాంగ్రెస్‌కు ఏ ప్రతిపాదికన భూమిని కేటాయించారో చెప్పాలన్నా,రు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అనుచరుల పేర్లతో భూములను కూడబెట్టుకుంటొందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కార్యాలయాల కోసం కేటాయించుకున్న స్థలాలను రద్దు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, మధ్య తరగతి ప్రజలు విసిగిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..? కేసీఆర్‌ను ఎప్పుడు ఫామ్ హౌస్‌కు పంపుదామా అని ఎదురు చూస్తున్నారన్నారు.
Live: Press Meet, @BJP4Telangana State Office, Nampally, Hyderabad. https://t.co/gJ9LwmoTvd
— G Kishan Reddy (@kishanreddybjp) August 14, 2023