Chandrababau: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరగనుండగా.. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సినీ సెలబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆహ్వానం అందగా.. రేపు వారు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
మరో ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలు జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ కు సైతం ఇప్పటికే ఆహ్వానం అందింది. దీంతో వీరిద్దరు ఇప్పుడు బాబు ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు అవుతారా? లేదా? అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం.. ఆయన టార్గెట్ గా నాగబాబు ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలు వచ్చాయన్న చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో రేపు జరగనున్న చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ వస్తారా? లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యామిలీ మధ్య ఇప్పుడు సఖ్యత లేదు అన్న టాక్ ఉంది. ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో అనేక సార్లు వివాదం జరిగింది. అయితే.. ఇటీవల ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు సైతం థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతారా? లేదా? అన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.