T20 World Cup: ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో సంచలన విజయం సాధించిన భారత జట్టుపై పాక్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెన్ ఇన్ బ్లూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు సంతోషంగా ఉందని, ఈ విజయానికి రోహిత్ అండ్ టీమ్ పూర్తిగా అర్హులంటూ పొగిడేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు రాణించకపోతే 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ కిరీటం వచ్చేది కాదంటూ బుమ్రా, హార్దిక్ లను ఆకాశానికెత్తేస్తున్నారు.
ఈ మేరకు 'ఇండియా WINSSSS!!! రోహిత్ &అతని కుర్రాళ్ళు ఈ సందర్భానికి తగ్గట్టుగా ఆడారు' అంటూ షోయబ్ అక్తర్ కొనియాడారు.
'టీ20 WC ఛాంపియన్‌గా నిలిచిన BCCI టీమిండియాకు అభినందనలు. హార్దిక్ మళ్లీ మ్యాజిక్ చేసాడు. రోహిత్ టీమ్ ప్రదర్శనకు ప్రపంచమంతా చప్పట్లు కొట్టారు. హార్డ్ లక్ సౌతాఫ్రికా.. మీరు కూడా అద్భుతమైన క్రికెట్ ఆడారు. ఇది మీ రోజు కాదు' అంటూ కమ్రాన్ అక్మల్ స్పందించాడు.
'చిరస్మరణీయ విజయం సాధించిన భారత్‌కు అభినందనలు. రోహిత్ దానికి పూర్తిగా అర్హుడు. అతను అసాధారణమైన నాయకుడు. కోహ్లీ ఎప్పటిలాగే పెద్ద మ్యాచ్ ఆటగాడు. బుమ్రా ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్. ప్రోటీస్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడింది. గొప్ప పోరాటం చేసింది' అని షాహిద్ ఆఫ్రిది అన్నారు.
'కష్టమైన పరిస్థితుల్లో గొప్ప ఆటగాళ్ళు ఇతరుల కంటే మెరుగ్గా రాణిస్తారు. కోహ్లీ అద్భుతమైన నాక్ ఆడాడు. కానీ చివరి రెండు ఓవర్ల వేసిన జస్ప్రీత్ బుమ్రా అసలైన ప్రపంచ కప్ విజేత. అభినందనలు టీమ్ ఇండియా' అంటూ వకర్ యునీస్ పొగిడేశారు. వీరందిరీ పోస్టులు వైరల్ అవుతున్నాయి.