T-BJP Chief Kishan Reddy: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు అలా చేయకుండా ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నేతలు సన్నవడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చురకలు అంటించారు. రాష్ట్రంలో 80శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని అన్నారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. దొడ్డు వడ్లను కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.