ICC T20I Player of the Year for 2023: గ్రౌండ్ చుట్టూ బంతితో గిరి గీసినట్టు కొట్టే చూడముచ్చటైన షాట్లతో టీ20 అనగానే శివాలెత్తిపోయే సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) మరో ఘనత సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో శతృభీకరమైన ఫాంను కొనసాగిస్తున్న మిస్టర్ 360 ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలందించిన సూర్య ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడం వరుసగా ఇది రెండోసారి.
ఇది కూడా చదవండి: బజ్‌బాల్ గేమ్ పై స్పందించిన రోహిత్.. అదే తలనొప్పిగా మారిందంటూ
అవార్డు ప్రదానం చేస్తూ టీ20 ఫార్మాట్‌లో సూర్య టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముక లాంటి వాడంటూ ఐసీసీ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. ఆ ఫార్మాట్‌లో సూర్య నమోదు చేసిన గణాంకాలే దీన్ని స్పష్టంచేస్తున్నాయి. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, అద్భుతమైన ఫాంతో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నమయ్యాడు సూర్య భాయ్. 2023లో 50కి పైగా సగటు, 150 స్ట్రైక్ రేటుతో విజృంభించాడు. అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యను ఐసీసీ (ICC) వరుసగా రెండో సంవత్సరం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
సూర్యకుమార్ యాదవ్ నిలకడ, ఒత్తిడిని తట్టుకుని రాణించగల సామర్థ్యాలను; ముఖ్యంగా ఇయర్ ఎండ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆటతీరును ఐసీసీ ప్రశంసించింది. అదనంగా కెప్టెన్సీ భారం ఉన్నప్పటికీ అసాధారణమైన నాయకత్వ పటిమ ప్రదర్శించి, జట్టుకు కీలకమైన ఆటగాడిగా కొనసాగాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్‌లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వెస్టిండీస్‌పై 83 (44), ఫ్లోరిడాలో కీలకమైన 61 (45) కీలకమైనవి. ఇక శ్రీలంకపై తొమ్మిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో విరుచుకుపడి ఉత్కంఠను రేపిన సెంచరీ (112; 51 బంతుల్లో) బాదుడును అభిమానులు మర్చిపోలేరు. అది పురుషుల టీ20ఐల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ.
ప్రస్తుతం జర్మనీలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) అతడు ప్రాతినిధ్యం వహిస్తు్న్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్ లోగా తిరిగి గ్రౌండ్‌లో మెరుస్తాడనే అంతా ఆశిస్తున్నారు. వరుసగా ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొట్టి క్రికెట్‌లో కీలక ఆటగాడిగా సూర్య స్థానాన్ని సుస్థిరపరిచాయి.