Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీంకోర్టు నిరాకరణ

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది.

Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీంకోర్టు నిరాకరణ
New Update

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం చూసుకుంటే.. స్వలింగ సంపర్క జంటలు చేసుకునే వివాహానికి ఎటువంటి గుర్తింపు లేదని.. ఇలాంటి వివాహాలకు మేం హక్కులను కల్పించలేమని తెలిపింది. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదని.. అయితే ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను చేసే బాధ్యత పార్లమెంట్‌కే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఈ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. 3-2 తేడాతో ద‌త్త‌త హ‌క్కుల‌పై కూడా ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది. జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్కే కౌల్‌లు .. స్వ‌లింగ సంప‌ర్కులు ద‌త్త‌త తీసుకోవ‌చ్చని వెల్ల‌డించారు. జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్‌, పీఎస్ న‌ర్సింహా, హిమా కోహ్లీలు ద‌త్త‌త హ‌క్కుల‌ను వ్య‌తిరేకించారు.

మరోవైపు క్వీర్ యూనియన్లలోని వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం కోరింది. రేషన్ కార్డులలో కూడా క్వీర్ జంటలను కుటుంబంగా చేర్చడం, జాయింట్ బ్యాంక్ ఖాతా కోసం నామినేట్ చేసేందుకు అనుమతించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుండి వచ్చే హక్కులు.. వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించాలని పేర్కొంది. అలాగే ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాలని తెలిపింది. క్వీర్ కమ్యూనిటీకి వస్తువులు, సేవలను పొందడంలో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించారు. క్వీర్ హక్కుల గురించి ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్వీర్ కమ్యూనిటీ కోసం హాట్‌లైన్‌ని సృష్టించడం, హింసను ఎదుర్కొనే క్వీర్ జంటల కోసం సురక్షిత గృహాలను 'గరిమా గృహ్' ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇంటర్-సెక్స్ పిల్లలు బలవంతంగా ఆపరేషన్‌లు చేయించుకోకుండా చూసుకోవాలని తెలిపారు. క్వీర్ జంటపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సూచించారు. లైంగిక ధోరణి ఆధారంగా ఆ జంటలను యూనియన్‌లోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేమన్నారు.

#supreme-court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe