ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసు (Skill Development Case) విషయమై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై (Quash Petition) సుప్రీంకోర్టులో రెండో రోజు వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. 17 ఏ సెక్షన్ చుట్టే వాదనలు సాగాయి. ఈ కేసుకు సంబంధించి 17 ఏ వర్తించదని సీఐడీ లాయర్లు వాదనలు వినిపిస్తే.. చంద్రబాబు లాయర్లు మాత్రం వర్తిస్తుందని వాదించారు. అయితే.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే.. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినపించారు. అయితే తదుపరి విచారణకు తాను వర్చువల్ గా హాజరు అవుతానని హరీశ్ సాల్వే వెల్లడించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే!
ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా.. తన వాదనలకు బలం చేకూరేలా 17ఏ సెక్షన్ కు సంబంధించి గతంలో వివిధ కేసుల తీర్పులను హరీశ్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఫేల్ కేసును కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రఫెల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ జోసెఫ్ కొట్టేసిన విషయాన్ని సాల్వే ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. 2018లో ఈ కేసుకు సంబంధిచిన విచారణ ప్రారంభమైందన్నారు. ఇందుకు పాత చట్టాలే ఆధారంగా తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2018లోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభమైందన్నారు. 2021 డిసెంబర్ 9వ తేదీ రోజు ఎఫ్‌ఐఆర్ నమోదైందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు.