NTA : నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. దీంతో సుప్రీం మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్ష నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా ఇందుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంకా పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది.
లీకేజ్ ఆరోపణలపై 2వారాల్లో జవాబు చెప్పాలని తెలిపింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సుప్రీంకోర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సమస్యలు పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. నీట్ పరీక్షల్లో (NEET Exams) అవకతవకలు జరిగాయని పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పేపర్ ఎక్కడా లీక్ కాలేదని స్పష్టం చేశారు.
పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్