Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య జరిగిందని తెలిసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మూడు గంటల సమయం ఎందుకు తీసుకున్నారని బెంగాల్ ప్రభుత్వం, అధికారుల తీరుపై సీరియస్ అయింది. అభయ డెడ్ బాడిని తల్లిదండ్రులకు ఎందుకు ఆలస్యంగా అప్పగించారంటూ ప్రశ్నించింది. అంతేకాదు ఆర్‌జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఎందుకు నియమించారంటూ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
వైద్యుల భద్రతపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
అభయ కేసులో ఆందోళనలు చేపడుతున్న వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. బాధితురాలి పేరు, ఫొటోలు, డెడ్‌బాడీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిలదీసింది. అలాగే ఆగస్టు 14న హాస్పిటల్‌పై గుంపు దాడి చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని, అల్లర్లను అపకుండా కాలక్షేపం చేస్తున్నారా అంటూ చురకలంటించింది. ఇక ఆగస్టు 22న కేసు విచారణ స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని దర్మాసనం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మహిళా వైద్యుల భద్రతపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.